Pages

19 October, 2010

ఈ ఆహారంతో రొమ్ము క్యాన్సర్‌కు దూరం దూరం..!!

ప్రస్తుత కాలంలో మహిళలకు ఎక్కువగా వచ్చే వ్యాధులలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. మహిళలకు పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న ఈ వ్యాధి మనదేశంలో ప్రతి 22 మందిలో ఒక్కరు వారి జీవితకాలంలో ఎప్పుడైనా సరే రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని అనేక అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. ఈ వ్యాధి వచ్చేందుకు ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా.. ఆహారంలో, జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకుంటే ఈ వ్యాధికి ఫుల్‌స్టాప్ పెట్టేయవచ్చు.

ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సమతులమైన పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం, భవిష్యత్తుపట్ల ఆశావహ దృక్పథం లాంటివి ఉన్న మహిళలు ఈ వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు. ఆహారంలో మార్పుల కారణంగా 80 శాతం వరకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నుంచి విముక్తి పొందే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇందులో భాగంగా ముందుగా వంటనూనెల వాడకంలో చిన్నపాటి మార్పులు అవసరం. ఏడాది పొడవునా ఒకే రకం నూనెను వాడటం కాకుండా, తరచుగా మారుస్తుండాలి. వేరుశెనగ, రైస్‌బ్రాన్, ఆలీవ్ ఆయిల్, నువ్వులనూనె వాడకాన్ని వంటల్లో పెంచుకోవాలి. అయితే ప్రతిరోజూ ఆహారంలో కొవ్వునుంచి కేవలం 20 కెలోరీలు మాత్రమే అందేలా జాగ్రత్త పడాలి.

వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో తృణధాన్యాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా దంపుడు బియ్యం, జొన్నలు, సజ్జలు, పొట్టుతీయని గోధుమలతో చేసిన బ్రెడ్ రోజువారీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటంవల్ల శరీరంలోని ఈస్ట్రోజన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది.
 

ఇంకా.. మాంసకృత్తులు అధికంగా లభించే బీన్స్, రాజ్మా, పచ్చిబఠాణీలు, శెనగలు, బొబ్బర్లు, పెసళ్లను.. ఉడికించిగానీ, మొలకెత్తించిగానీ తీసుకోవచ్చు. అలాగే బాదం, వేరుశెనగ, వాల్‌నట్, పిస్తా పప్పుల్లో ఉండే పీచు, మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా లభిస్తాయి. ఇవి రోజుకు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

తాజాగా నిగనిగలాడే పండ్లు, కూరగాయలకు క్యాన్సర్‌ను నిరోధించే శక్తి అధికంగా ఉంటుంది. వీటిలోని ఫైటో‌కెమికల్స్‌కు వ్యాధి నిరోధక గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే రోజులో రెండు లేదా మూడుసార్లైనా పండ్లు, కూరగాయలతో తయారుచేసిన సలాడ్లను ఎక్కువగా తీసుకోవటం ఉత్తమం.

బ్రకోలి, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి వాటికి రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి రోజువారీ ఆహారంలో వీటి మోతాదును పెంచుకోవాలి. టొమోటోలను కూడా అధికంగా తీసుకోవాలి. ఇందులోని లైకోపీన్ రొమ్ము క్యాన్సర్‌కు బాగా పనిచేస్తుంది. ఇంకా ద్రాక్ష, పుచ్చకాయ, జామల నుంచి కూడా వివిధ మోతాదుల్లో లైకోపీన్ అందుతుంది.

అదే విధంగా బీటా కెరోటిన్ అధికంగా ఉండే చిలగడదుంపలు, క్యారెట్లు, నిమ్మజాతి పండ్లయిన నారింజ, ద్రాక్షలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం మెండుగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, రేగుపండ్లు, బాగా మగ్గిన నేరేడుపండ్లు, ముదురు ఆకుపచ్చని రంగుల్లో ఉండే ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడటమేగాక, రొమ్ముక్యాన్సర్‌ను నిరోధిస్తాయి.


No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel