అవినీతి, అక్రమాలకూ పాల్పడి అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులకు గల ప్రజాదరణ చూస్తుంటే, ఉన్నత స్థాయిలో అవినీతి ప్రజలకు ఇంకా పట్టే వాతావరణం భారతదేశంలో ఏర్పడలేదని, అలాగే అవినీతి విషయంలో ప్రజలు అన్ని పార్టీలను ఒకే గాటన కట్టేస్తున్నారని తెలుస్తోంది.
రాజకీయ నాయకులు అంతా అవినీతిపరులే అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇక్కడే మరో విషయాన్ని కూడా గుర్తించాలి. నాయకుల అవినీతి కార్యకలాపాలు తక్షణమే ప్రజలపై ప్రభావం వేసే పరిస్థితి లేదు. దీర్ఘకాలంలో వాటి ప్రభావం ప్రజలపై సామూహిక ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే చూపుతున్నాయి కూడా. వాటిని గ్రహించే స్థితి కూడా ప్రజలకు లేదు.
ఇక, ఉన్నత స్థాయిలో అవినీతి జరిగినప్పటికీ నిత్య జీవనంలో తక్షణ ప్రయోజనం కలగడాన్ని మాత్రమే ప్రజలు తమ అనుభవంలోకి తీసుకుంటున్నారు. పాలకులు లేదా రాజకీయ నాయకులు ఎంతగా అవినీతికి పాల్పడినా తమకు ఏ మేరకు మేలు జరుగుతుందనేది చూస్తున్నారు. అది కూడా తమ వ్యక్తిగత ప్రయోజనమై ఉండాలి.
అలాగే, 2జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ క్రీడల వంటి కుంభకోణాల్లో కాంగ్రెస్ తమ పార్టీ వారిని కూడా సహించేదిలేదని, కళంకితులను కాంగ్రెసు సహించడానికి సిద్ధంగా లేదని ఎంతగా ప్రచారం చేసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ కేసులు క్రమంగా నీరు కారుతాయనే అభిప్రాయమే ప్రజల్లో బలంగా ఉంది.
No comments:
Post a Comment