ఇది నా సొంత అభిప్రాయం..., కాబట్టి ఇది ఎక్కడ చదివావురా బాబూ..., అని అడక్కండే...
కర్మ అనేది భగవంతుడి కన్నా అతీతమైనది. ఆ భగవంతుడు కూడా తప్పించుకోలేడీ కర్మను. విష్ణువు దశావతారాలు ఎత్తాడు, రాముడు, కృష్ణుడు వగైరా అవతారాలలో కొన్ని కష్టాలు పడ్డాడు, ఇంద్రుడు, చంద్రుడు... ఇలా ఎవరూ కర్మకు అతీతులు కారు. రామునికి అరణ్య వాసం తప్పలేదు, అలాగే కృష్ణుడు వేటగాని బాణం దెబ్బకు అవతారం చాలించక తప్పలేదు. ఏమన్నా అంటే విష్ణువు దశావతారాలు లోకకల్యాణం కోసం, దుష్ట శిక్షణ..., శిష్ట రక్షణ కోసం అంటారు. కానే కాదు, ఇక్కడ విష్ణువు అన్ని అవతారాలలోనూ అతని శత్రువులు, అతని ద్వారపాలకులు జయ విజయులే విష్ణువు కు శత్రువులు గా జన్మించారు. ఇక్కడ వారి వారి కర్మ ల ఫలితమే ఈ దశావతారాలు కావచ్చు.
సరే..., దేవుళ్ళ సంగతి తరువాత. ప్రతి జీవి కి, వారి కర్మల ప్రకారం, అంటే చెడు కర్మల, మంచి కర్మల ఫలితాలు వాటి జన్మలకు అతీతం గా అనుభవిస్తుంటారు. కొంతమంది ఈ జన్మ లో మంచి కర్మలు చేస్తున్నా, పూర్వ జన్మ ల కర్మ ల ప్రభావం వల్ల కష్టాలు అనుభవిస్తుంటారు. మరి కొంతమంది ఈ జన్మ లో చెడు కర్మలు చేస్తున్నా, పూర్వ జన్మల కర్మ ల ప్రభావం వల్ల సుఖాలు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ ఈ జన్మలో చేసిన కర్మ ల ఫలితం ఈ జన్మ లోనే అనుభవించాలని ఉండదు. ఇప్పుడు కష్టాలు పడుతున్నామని పూజలు పునస్కారాలు చేసేస్తే భగవంతుడు అర్జెంటు గా మన కష్టాలు తీర్చలేడు. మన కర్మల ఫలితాన్ని భగవంతుడు కూడా మార్చలేడు. అందుకే కొందరు భగవంతుని పై ఆశలు, నమ్మకం వగైరాలు పెట్టుకోకుండా మంచి కర్మలు చేస్తూ ప్రశాంతం గా బ్రతికేసే కొంతమందిని మనం సమాజం లో చూస్తూంటాం. అలాంటి వాళ్ళను ఆదర్శం గా తీసుకుందాం.
సరే..., వాడెవడో చెడు చేస్తున్నాడని, లేదా మనకు చెడు చేసాడని, దానికి తగ్గ ఫలితం వాడు అనుభవించాలని మనం వాడికి చెడు చేయాలని ప్రయత్నిస్తే, వాడి సంగతి తరువాత, ముందు మనం చెడు కర్మ చేసినవారమవుతాం. అలా అని మనం ఊరుకోవాలా...? అంటే..., చెడు కర్మలు చేయకుండా అతన్ని face చేయండి.
అలాగే, కర్మ అనేది సమాజం లోని కట్టుబాట్లకు సంబంధించింది కూడా కాదు. సమాజం దృష్టి లో తప్పు అయినటువంటి కొన్ని కర్మలు చెడు కర్మలు కాకపోవచ్చు. కొన్ని సమాజాలకు తప్పు కానటువంటి కర్మలు చెడు కర్మలు కావచ్చు. అలాగే మననుండి ఏదో ఆశించి, భంగపడి మన ప్రమేయం లేకుండా మన వలన ఎదుటివాడు బాధపడితే అందులో మన తప్పూ ఉండక పోవచ్చు, బాధపడడం అతని కర్మ కావచ్చు.
ఓకే... ఇదేం ఖర్మ రా బాబూ... అనుకుంటున్నారా, సరే..., ఇక ఆపుతున్నా...
అసలే దీనికి అంతం అనేది ఉండదు, ఇలా చెప్పుకుంటూ పోతే...
No comments:
Post a Comment